రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడికి 4 నిమిషాల్లో చేరుకుని చర్యలు తీసుకుంటారని స్పష్టం చేస్తున్నారు.పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మద్యం సరఫరా, నగదు పంపిణీ, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని కోసం రాచకొండ వాట్సాప్ నంబరు 9490617111కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా 4 ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన పోలీసులు చర్యలు తీసుకుని తిరిగి సమాచారం అందించిన పౌరుడికి యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా సందేశం రూపంలో పంపిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ నిఘా టీంలను పెంచారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిఘా బృందాలు, సర్వేలెన్స్ టీంల సంఖ్యను భారీగా పెంచారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )