కామన్వెల్త్ దేశాల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీసిరో) ఆస్ట్రేలియా అనుబంధ నేషనల్ సైన్స్ ఏజన్సీ, కరోనా వైరస్ నివారణకు వాక్సిన్ ను కనుగొని, దాని టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్షలు కనీసం మూడు నెలల కాలం పాటు సాగుతాయని, వీటిని దేశంలోనే అత్యధిక భద్రత మధ్య ఉండే జీలాంగ్ లోని ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని బయో సెక్యూరిటీ కేంద్రంలో జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం సీఈపీఐ (కోయలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, కరోనా వాక్సిన్ పై పరీక్షలు చేసినట్టు సీసిరో పేర్కొంది. కాగా, సీఈపీఐ, డబ్ల్యూహెచ్ఓలు ఇప్పటికే కరోనా వాక్సిన్ ల తయారీకి సమర్థవంతంగా పనిచేసే అవకాశాలున్న పలు ఔషధాలను గుర్తించింది. ఇందులో భాగంగా యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్ట్, ఇన్వియో ఫార్మాసూటికల్స్ తయారుచేసిన వాక్సిన్ తొలి క్లినికల్ ట్రయల్స్ కు అనుమతినిచ్చింది. ఆ తరువాత వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తమకే అనుమతి లభించిందని సీసిరో ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.