ఆ స్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ‘స్పెయిన్ బుల్’ రఫెల్ నాదల్ దూసుకెళుతున్నాడు. రెండో రౌండ్‌లోనూ వరుస సెట్లలో గెలిచి 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో మరో ముందంజ వేశాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా, సిమోనా హలెప్ వరుస సెట్ల విజయాలతో సత్తాచాటారు. ఇక జెలీనా ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశ ఎదురైంది.గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 6-3, 7-6(4), 6-1తో ఫెడ్రికో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి సెట్‌ను నాదల్ 6-3తో నెగ్గినా.. రెండో సెట్‌లో డెల్బోనిస్ పోటీ ఇచ్చాడు. ఇక మూడో సెట్‌లో విజృంభించిన రఫా 6-1తో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకొన్నాడు.
మహిళల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా సత్తాచాటింది. రెండో రౌండ్‌లో ప్లిస్కోవా 6-3, 6-3తో లారా సిగ్మండ్ (జర్మనీ)ని వరుస సెట్లలో చిత్తు చేసింది. నాలుగో సీడ్ హలెప్ 6-2, 6-4తో హెర్రీట్ డార్ట్ (బ్రిటన్)పై, స్పెయిన్ ప్లేయర్ ముగురుజ 6-3, 3-6, 6-3తో తమోల్జరోవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. ఇక ఒస్టాపెంకో 5-7, 5-7తో ఆరో సీడ్ బెలిండా బెనిక్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది.నాలుగో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 7-5, 6-1, 6-3తో స్పెయిన్ ఆటగాడు పెడ్రో మార్టినెజ్‌పై విజయం సాధించాడు. 5వ సీడ్ డొమినిక్ థీమ్ 6-2, 5-7, 6-7(5), 6-1, 6-2తో అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై ఐదు సెట్ల పాటు పోరాడి గెలిచాడు. అలెగ్జాండర్ జ్వరెవ్ 7-6(5), 6-4, 7-5తో ఇగర్ జెరాసిమోవ్ (బెలార్‌స)పై.. వావ్రింకా 4-6, 7-5, 6-3, 3-6, 6-4తో ఆండ్రేస్ సెప్పీ (ఇటలీ)పై.. కిరియోస్ (ఆస్ట్రేలియా) 6-2, 6-4, 4-6, 7-5తో గిల్లీస్ సైమన్ (ఫ్రాన్స్)పై గెలుపొందారు.