కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేశ్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా రమేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇదే విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా… సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏపీ ప్రభుత్వం పిటిషన్లు వేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ లేదని… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహించవచ్చని ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఈ లేఖకు రమేశ్ సమాధానం ఇచ్చారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎస్ఈసీ రమేశ్ మూడు పేజీల పూర్తి స్థాయి వివరణతో లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే ఎన్నికలను వాయిదా వేశామని తెలిపారు. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని… ఇప్పటికే పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేశారని పేర్కొన్నారు. అదే విధంగా ఏపీలో కూడా వాయిదా వేశామని చెప్పారు. ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే ఆరోపణలకు కూడా రమేశ్ వివరణ ఇచ్చారు. ఆర్థికశాఖలో పని చేసిన అనుభవం తనకు ఉందని… ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా నిధులను తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. ఎన్నికల వాయిదాకు ఎస్ఈసీ కట్టుబడి ఉందని… తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ఉందని… ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఆయన పేర్కొనలేదు.