ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం, మాచర్లతో పాటు పలు చోట్ల జరిగిన దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన రాజమహేంద్ర వరంలో మీడియాతో మాట్లాడుతూ… ‘ఏపీలో జరిగిన హింస, దౌర్జన్యాలపై మేము నివేదికలు తయారు చేస్తున్నాం. జరుగుతున్న దాడులకు సమాధానం చెప్పాలి. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర హోం శాఖకు కూడా లేఖ రాస్తున్నాం. అన్ని విషయాలను వివరించి చెబుతాం’ అని చెప్పారు. ‘ఏయే అధికారి ఏయే తప్పులు చేశారన్న విషయాలను కూడా బయట పెడతాం. వైసీపీ అధికారంలో ఉందని, సులువుగా తప్పించుకోవచ్చని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టరు’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.