టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్రను పోషించడంలో విఫలమయ్యారన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర అంటే ఏంటి విజయసాయిరెడ్డిగారూ అంటూ ప్రశ్నించారు. రైళ్లను తగలబెట్టడం, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని నరికేయండి, కాల్చేయండి అని చొక్కా చించుకోవడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పంటను తగలబెట్టడం.. ఇదేనా నిర్ణయాత్మక పాత్ర అంటే? అని నిలదీశారు.
మీ ముఖ్యమంత్రి జగన్ చెత్త నిర్ణయాలతో కడుపు మండి ప్రజలు మాట్లాడుతుంటే… వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానిస్తారా? అని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టిందే మీ జగన్ అని ఎద్దేవా చేశారు. మీ పెయిడ్ ఆర్టిస్టులకు జీతాలిచ్చి మరీ ప్రజల మీదకు వదిలారని… వారందరికీ ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని విమర్శించారు. లిస్ట్ వదలమంటారా? ఆర్టిస్టుల బాగోతం ఏంటో తేల్చుకుందామా? అని సవాల్ విసిరారు.