కేరళలో ఓ అద్భుతం జరిగింది. పథనంతిట్ట జిల్లాలో కరోనా మహమ్మారి సోకిన 93 సంవత్సరాల వృద్ధుడు, ఇప్పుడు రికవరీ అయ్యాడు. థామస్ అబ్రహాం, అతని భార్య మరియమ్మ (83) ఇద్దరికీ కరోనా సోకగా, తాజా రక్త పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. వారిద్దరికీ సొంత కుమారుడి నుంచే ఈ వైరస్ సోకింది. అతని కుమారుడు, కోడలు, మనవడు గత నెలలో ఇటలీ నుంచి రాగా, వారి ద్వారా వీరికి వ్యాధి సంక్రమించింది. ఇక వృద్ధ దంపతులు కోలుకున్న తరువాత, వారు ఎలా వైరస్ ను శరీరం నుంచి పారద్రోలగలిగారన్న రహస్యం గురించి వారి మనవడు రిజో మాన్సీ తన మనసులోని మాటను పంచుకున్నారు. వారిద్దరి జీవన విధానం చాలా ఆరోగ్యకరమని తెలిపారు. రన్నీ సబ్ డివిజన్ లో ఓ రైతుగా జీవితాన్ని సాగించిన ఆయన, తన జీవితకాలంలో ఎన్నడూ పొగ తాగలేదని, జిమ్ కు వెళ్లకుండానే, పొలం పనులతో సిక్స్ ప్యాక్ బాడీని సాధించిన ఘనత ఆయనదని తెలిపారు. కేరళకు మాత్రమే పరిమితమైన ‘పళంకంజి’ (బియ్యంతో తయారు చేసే ఓ వంటకం) ఆయనకు ఎంతో ఇష్టమని, జాక్ ఫ్రూట్ స్నాక్స్ ఇష్టంగా తింటారని తెలిపారు. ఇదే ఆయన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనం కాకుండా కాపాడిందని అంచనా వేశారు. కొట్టాయం మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఆయనకు చికిత్స జరిగిందని తెలిపారు.
ఇంత వృద్ధాప్య వయసులో ఇండియాలో కరోనా కోరలకు చిక్కకుండా బయటపడిన తొలి వ్యక్తి అబ్రహాం కావడం గమనార్హం. ఇదో అద్భుతమని తాము భావిస్తున్నామని, వారిని కాపాడేందుకు డాక్టర్లు చేసిన కృషి అమోఘమని ఇటలీలో రేడియాలజిస్ట్ గా సేవలందిస్తున్న రిజో వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాము ఆగస్టులో ఇండియాకు రావాలని భావించామని, అయితే, తమ ప్రయాణం ముందుకు జరిగిందని తెలిపారు. లేకుంటే ఈ సమయంలో తాము ఇటలీలోనే ఉండే వాళ్లమని అన్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులకు ముగ్గురు పిల్లలు, ఏడుగురు మనవలు, మనవరాళ్లు, 14 మంది ముని మనవలు, ముని మనవరాళ్లు ఉన్నారు. వీరిద్దరికీ వయసు కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యలు ఉన్నా, వైరస్ నుంచి కోలుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని రిజో అన్నారు.