కరోనా వైరస్స్ కినప్పటికీ.. సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందిలే అనేది ఇప్పటివరకు యావత్ ప్రపంచానికి ఉన్న ఏకైక ధీమా. కానీ కరోనావైరస్ గురించి తాజాగా వెలువడుతున్న ఈ వార్తలు వింటుంటే మరోసారి యావత్ ప్రపంచమే షాక్‌కి గురవుతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి తాజాగా మరో చేదు వార్త గుప్పుమంది. అదేమంటే.. ఇప్పటికే కరోనా కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారనే ఆందోళన ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంటే.. మరోవైపు బ్లూమ్‌బర్గ్‌లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం కరోనాతో కోలుకున్న రోగులలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ మరోసారి సోకే ప్రమాదం లేకపోలేదని దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 51 మంది వ్యక్తులకు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్-కియాంగ్ చెప్పినట్టుగా బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. క్వారంటైన్ లోంచి బయటికొచ్చిన వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయగా ఈ విషయం బయటపడిందని చెప్పిన జియాన్ యన్-కియాంగ్.. వారికి కరోనా వైరస్ మళ్లీ సోకిందని చెప్పడం కంటే.. వైరస్ మళ్లీ రీయాక్టివేట్ అయిందని చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా వైరస్ మళ్లీ రీయాక్టివ్ అవడంపై అధ్యయనం చేస్తున్నామని యన్-కియాంగ్ తెలిపారు. అంతేకాకుండా ఇంకొంత మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే సమయంలో ఒక రోజు నెగటివ్ అని వస్తే.. మరో రోజు పాజిటివ్ అని ఒకదానికొకటి సంబంధం లేకుండా ఫలితాలు వస్తున్న సందర్భాలూ ఉన్నాయని చెబుతూ.. ఈ విషయాలన్నింటిపైనా అధ్యయనం చేస్తున్నట్టు జియాంగ్ యన్-కియాంగ్ స్పష్టంచేశారు. ఇక ఒక రోగికి కరోనా వ్యాధి నయమైందా కాలేదా అనేది ఎలా తెలియాలంటే… పాజిటివ్ కలిగిన వ్యక్తికి 24 గంటల వ్యవధితో చేసిన రెండు పరీక్షల్లోనూ నెగటివ్ అనే ఫలితం వచ్చినట్టయితేనే.. ఆ వ్యక్తి కరోనా నుంచి తేరుకున్నట్టుగా పరిగణిస్తారు.
ఇదిలావుంటే, ఏప్రిల్ 9, గురువారం రాత్రి వరకు అందుబాటులో ఉన్న అప్‌డేట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15.36 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 93,425 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ అండ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. 3.46 లక్షలకుపైగా మంది కరోనాతో పోరాడి విజయం సాధించారు.