కార్చిచ్చును అదుపు చేసేందుకు వచ్చిన కెనడా విమానం అల్పైన్ ప్రాంతంలో గురువారం కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ముగ్గురు సిబ్బంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా అమెరికన్ పౌరులేనని చెప్పారు.. మొనారో మంచు ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్ర రూరల్ ఫైర్ సర్వీసెస్ కమిషనర్ షేన్ ఫిట్జ్‌సిమ్మన్స్ తెలిపారు. పూర్తి స్థాయిలో నీటిని నింపుకున్న ఈ వాటర్ ట్యాంకర్ విమానం కార్చిచ్చు మంటలను అదుపు చేసే క్రమంలో కూలిపోయిందన్నారు. ఈ విమానాన్ని కెనడియన్ అగ్నిమాపక సంస్థ కౌల్సన్ ఏవియేషన్ లీజుకు తీసుకున్నదని ఫిట్జ్‌సిమ్మన్స్ వివరించారు. కార్చిచ్చు మంటలను అదుపు చేసేందుకు వచ్చిన విమానాల్లో ఇది రెండోదన్నారు. ఈ ప్రమాద ఘటనతో గత సెప్టెంబర్‌లో కార్చిచ్చు రగులుకున్న నాటి నుండి మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. ఈ కార్చిచ్చుల బారినపడి దాదాపు వందకోట్లకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయని, 2,500 ఇళ్లకు పైగా బూడిదయ్యాయని అధికారులు చెబుతున్నారు. కార్చిచ్చుల ప్రభావానికి లోనైన ప్రాంతం మొత్తం జర్మనీ వైశాల్యంలో మూడో వంతుకు సమానమన్నారు.