బుధవారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి కల్యాణ మండపం గేటుకు తాళాలు వేశారు. కార్యాలయానికి ఎలా అనుమతిచ్చారని మేనేజర్‌ను ప్రశ్నించారు. వెంటనే ఖాళీ చేయించాలని హుకుం జారీచేశారు.
విజయవాడ నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి కేంద్ర కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని హుకుం జారీచేశారు. కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చిన భవన యజమానికి మౌఖికంగా బెదిరింపులతోపాటు నోటీసు ఇచ్చారు. ‘అనుమతులు రద్దు చేసి చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయగలం’ అంటూ పటమట పోలీసుస్టేషన్ సీఐ సురేష్‌రెడ్డి నోటీసు జారీ చేశారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా విజయవాడ కేంద్రంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో 45 సంఘాల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటుచేశారు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, మహిళా కార్మిక సంఘాలు భాగస్వాములై.. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కేంద్ర కార్యాలయం కోసం బెంజిసర్కిల్‌లో వేదిక కల్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ మండపం యజమాని మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తనయుడు చెన్నుపాటి వజీర్.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference