చైనా వంచక వైఖరి గురించి అనేక సందర్భాల్లో నిరూపితమైంది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతూనే, సరిహద్దుల్లో అతిక్రమణలకు పాల్పడుతుంటుంది. తాజాగా అదే జరిగింది. అయితే భారత్ ఈసారి భిన్నమైన పంథాలో వ్యవహరించి చైనాను నిర్ఘాంతపరిచింది. ఆత్మరక్షణ ధోరణి వదిలేసి ఎదురుదాడి వైఖరి అవలంబించింది. దీటైన జవాబిచ్చి డ్రాగన్ ఆటకట్టించింది.అసలు ఏంజరిగిందంటే… ఓవైపు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మనం సరిహద్దుల్లో కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. ఈసారి పట్టు వదిలేది లేదు అంటూ చైనా దళాలు ఆగస్టు 31కి ముందు సరికొత్త ప్లాన్ వేశాయి. మాల్డో-రజంగ్లా ప్రాంతానికి భారీ సాధన సంపత్తితో బయల్దేరాయి. కానీ, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఈ విషయాన్ని ముందే పసిగట్టి భారీగా రాకెట్ లాంచర్లు మోహరించాయి. పర్వత ప్రాంతాల యుద్ధ రీతుల్లో ఆరితేరిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ చైనా బలగాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. భారత బలగాలను చూడగానే చైనా దళాలు బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపాయి. దాంతో భారత బలగాలు తమ వద్ద ఉన్న అత్యాధునిక మిలన్ యాంటీ ట్యాంకు గైడెడె మిసైళ్లను, కార్ల్ గుస్తోవ్ రాకెట్ లాంచర్లను పొజిషన్ లో ఉంచాయి. ఈ ఆయుధాలతో చైనా యుద్ధట్యాంకులను నుజ్జునుజ్జు చేయవచ్చు. ఇక, చైనా కాల్పులకు ప్రతిగా భారత బలగాలు గాల్లోకి కాల్పులు జరపడంతో చైనాకు విషయం అర్థమైంది. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ముందు తమ పప్పులు ఉడకవని అర్థం చేసుకుని, వచ్చిన దారినే వెనక్కి పయనమైంది. ఈ తతంగం మొత్తం కేవలం 2 గంటల్లో ముగిసింది.