టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇదొక ప్రపంచవ్యాప్త మహమ్మారిగా రూపుదాల్చిందని అన్నారు. ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందంటే గడిచిన 24 గంటల్లో ఇది 9 దేశాలకు పాకిందని వెల్లడించారు. ముఖ్యంగా యూరప్ లో ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలను గజగజలాడిస్తోందని తెలిపారు. అనేక దేశాలు సరిహద్దులు కూడా మూసేశాయని, విమాన ప్రయాణాలు నిలిపివేశారని, బ్రిటన్ లో మహారాణిని సైతం సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చిందని వెల్లడించారు. యూరప్ నుంచి అమెరికా రాకుండా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మనదేశంలో కూడా నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. “ముంబయిలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీలో 50 మంది కంటే ఎక్కువమంది గుమికూడరాదని ఆంక్షలు పెట్టారు. సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. కోర్టులకు నేరుగా ఎవరూ రానవసరంలేదని చెప్పారు. వారానికి మూడు సిట్టింగ్ లేనంటూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అసోంలో స్కూళ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారు. బెంగాల్ లోనూ ఇంతే. కొన్నిచోట్ల పెళ్లిళ్లపైనా ఆంక్షలు విధించారు.
ప్రతిచోట ఇంతటి అప్రమత్తతతో అనేక చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నాడు. ఇది నిరంతరం ఉండే సమస్యే… దీనికి ఓ పారాసెటిమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని అంటాడు. లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లితే కంట్రోల్ అవుతుందని చెబుతున్నాడు. దీన్ని జాతీయ మీడియా అంతా తప్పుబడుతోంది. ఈ ముఖ్యమంత్రి కామెంట్లపై రచ్చరచ్చ చేసింది. ప్రపంచంలో ఎవరూ కనుక్కోని విషయం కనుక్కున్నాడని, ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది.ఇతనికి తోడు సీఎస్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారి ఎలాంటి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు ఉందని, అది కూడా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి సోకిందని, మూడ్నాలుగు వారాలపాటు రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం ఉండదని ఆమె చెబుతున్నారు. సీఎస్ గారూ, కరోనాపై మీకేమన్నా అవగాహన ఉందా? అని అడుగుతున్నా! కరోనాపై ఒక్కసారన్నా సమీక్ష నిర్వహించారా? ఏదన్నా కసరత్తు నిర్వహించారా? ఇటీవల రాష్ట్రానికి విదేశాల నుంచి 6,777 మంది వచ్చినట్టు గుర్తించారు. వారందరి చిరునామాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? వాళ్లలో కరోనా ఉంటే పరిస్థితి ఏంటి? కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో మీకు తెలుసా? న్యూయార్క్ లో మొదటి వారం 2 కేసులు ఉంటే, రెండో వారంలో వాటి సంఖ్య 105కి పెరిగి, మూడో వారానికి 613కి చేరింది. ఫ్రాన్స్ లో కూడా ఇలాగే జరిగింది. ఫ్రాన్స్ లో తొలి వారం 12 కేసులుంటే, నాలుగో వారానికి వాటి సంఖ్య 4,499కి పెరిగింది. ఇరాన్ లో తొలివారం రెండు కేసులే ఉన్నాయి, కానీ ఐదో వారానికి 12 వేలు దాటింది” అంటూ సోదాహరణంగా వివరించారు.