ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో అమీతుమీకి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మార్చి 21న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు/చైర్ పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంస్ అధ్యక్షులు, రైతుబంధు సమితులు జిల్లా అధ్యక్షులకు ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పోరును తీవ్రతరం చేస్తున్నందున అందరూ ఈ సమావేశానికి రావాలని స్పష్టం చేశారు.
కాగా, ఈ సమావేశం అనంతరం అదే రోజున సీఎం కేసీఆర్, మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ వెళతారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. పంజాబ్ లో పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్రం వంద శాతం కొనుగోలు చేస్తున్నందున, తెలంగాణలోనూ అదే తీరున వంద శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
కాగా, యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రంలో నిరసన ప్రదర్శనల విధివిధానాలను ఈ నెల 21న నిర్వహించే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.