హైదరాబాద్ పోలీస్ అంటూ ఫేక్ సర్టిఫికేట్లతో 16ఏళ్లుగా హవా నడిపిస్తున్నాడు ఓ కానిస్టేబుల్. అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్‌తో నిజం బయటికొచ్చి పలు సెక్షన్ల కింద బుక్ అయ్యాడు. చాప కింద నీరులా ఎంచక్కా పేరు మార్చేసుకుని సర్వీస్ చేసేస్తున్న వ్యక్తి అసలు పేరు సుధాకర్ రెడ్డి. ప్రకాశం జిల్లా పాముల్రుపల్లికి చెందిన వ్యక్తి పోలీసు ఉద్యోగంలోకి చేరాలనుకున్నాడు. దగ్గరి బంధువు అశోక్ వర్ధన్ రెడ్డి పదో తరగతి సర్టిఫికేట్స్ లో ఫొటో మార్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో పడిని పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవకాశంగా చేసుకున్నాడు. తెలిసిన వారందరికీ పాత పేరు మార్చి అశోక్ వర్ధన్ రెడ్డినంటూ చెలామణి అవడం మొదలుపెట్టాడు. పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్లో ఎంపికయ్యాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని అశోక్‌గా పోలీస్ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ పోలీస కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.సూరగుర్రెడ్డి అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితమే అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేశాడు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెంటనే రెస్పాండ్ కాకపోవడంతో, పలుమార్లు బోర్డు అధికారులను ఆశ్రయించాడు. రిక్రూట్‌మెంట్ బోర్డు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచికి విచారణ చేయాలంటూ సూచించింది. స్పెషల్ బ్రాంచ్ విచారణలో భాగంగా అశోక్‌వర్ధన్‌రెడ్డిగా మారిన సుధాకర్‌రెడ్డిని స్పెషల్ స్టైల్‌లో ప్రశ్నించింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగంలో చేరిన విషయం బయటికొచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సూపరింటెండ్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు ఈ ఘటనపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 419, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్‌రెడ్డే సుధాకర్‌రెడ్డి.