ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి వుండగా, ఆయన ప్రయాణం చివరి నిమిషంలో రద్దు అయింది. నాంపల్లి కోర్టులో సీబీఐ, ఈడీ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో, నేడు జగన్ హైదరాబాద్ కు రానున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, న్యాయమూర్తే సెలవులో ఉన్నారని, ఇక్కడి న్యాయవాదులు సీఎంఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో, ఆయన ప్రయాణం వాయిదా పడింది. ఆ సమయానికే జగన్, గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగన్, నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ కొన్ని విభాగాల సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం.