ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం పూర్తయింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు మోదీ ఈ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని భావించినా, నేడు ప్రధాని మోదీ ప్రసంగం ఉండబోదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుండగా, ఆపై మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎంలతో ప్రధాని చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మోదీ అధికారికంగా ప్రకటిస్తారని భావించినా, కేంద్ర వర్గాల ప్రకారం ఒకట్రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.