contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీసు కస్టడీలో తండ్రీకొడుకుల మృతి …దేశమంతట నిరసనలు

ఇటీవలే అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసు అధికారి కర్కశత్వానికి బలైపోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చింది. నిరసన జ్వాలలతో అమెరికా అట్టుడికిపోయింది. ఇప్పుడు భారత్ లో కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులను కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, ఆపై ఆ తండ్రీకొడుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరుసగా మృత్యువాత పడడం తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది.తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న సతంకుళం ప్రాంతానికి చెందిన జయరాజ్, ఫెనిక్స్ తండ్రీకొడుకులు, జయరాజ్ టింబర్ వ్యాపారం చేస్తుండగా, ఫెనిక్స్ మొబైల్ షాపు కలిగివున్నాడు. అయితే, తండ్రీకొడుకులు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సేపు తమ దుకాణాలను తెరిచి ఉంచారన్న ఆరోపణలతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్రంతా వారిని కస్టడీలోనే ఉంచారు. తర్వాత రోజు వారిని కోవిల్ పత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని గంటల వ్యవధిలో తండ్రీకొడుకులిద్దరూ చనిపోయారు. దాంతో వారి కుటుంబసభ్యులు రగిలిపోయారు. జయరాజ్, ఫెనిక్స్ లను పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే వారు కన్నుమూశారని ఆరోపించారు.ఈ ఘటన కొద్దిసేపట్లోనే తమిళనాడును చుట్టేసింది. విపక్షాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఈ విషయం శరవేగంతో పాకిపోయింది. దేశవ్యాప్తంగా ప్రముఖులు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనదేశపు జార్జి ఫ్లాయిడ్లు అంటూ ఆ తండ్రీకొడుకుల ఫొటోలు పోస్టు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు సైతం ఈ ఘటనలో పోలీసుల వైఖరినే తప్పుబడుతున్నారు.వారి కుటుంబానికి న్యాయం జరగాలంటూ క్రికెటర్ శిఖర్ ధావన్ ట్వీట్ చేయగా, గుజరాత్ యువ రాజకీయవేత్త జిగ్నేష్ మేవానీ భారతదేశపు జార్జి ఫ్లాయిడ్స్ చాలామంది ఉన్నారని విచారం వెలిబుచ్చారు. ఈ ఘటనలో పోలీసుల హింసాత్మక ధోరణి దారుణం అని పేర్కొన్నారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాజ్, ఫెనిక్స్ ల ఘటన గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :