కరోనా వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం రెపో, రివర్స్ రెపోరేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.4శాతానికి తగ్గిస్తున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గించి నాలుగుశాతానికి చేరుస్తున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. 150 మంది ఆర్‌బీఐ సిబ్బంది సైతం క్వారెంటెయిన్‌లో ఉన్నారని తెలిపారు. కరోనా ప్రభావంతో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించింది ఆర్బీఐ. రుణాలు తీసుకున్న అందరూ.. మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించింది ఆర్‌బీఐ. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారికి ఊరట లభించింది. అయితే మరి క్రెడిట్ కార్డులకి కూడా ఈ మారటోరియం వర్తించనుందా లేదా అనే విషయం మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది.