కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ్వరి కి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రీతీ…షెంజెన్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం చేస్తోంది.
శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా..డాక్టర్లు ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీని బారినపడ్డ తొలి విదేశీ వ్యక్తి ప్రీతీ అని స్థానిక డాక్టర్లు తెలిపారు. ప్రీతీ ప్రస్తుతం స్పృహలో లేదని, డాక్టర్లు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారని ఆమె భర్త ఆషుమన్ ఖోవాల్ చెప్పారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడతారు. ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది. వుహాన్ నగరంలో తొలిసారిగా ఈ వైరస్ గురించి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ వైరస్.. ప్రమాదకరమైన సార్స్ వైరస్‌ను పోలి ఉండటంతో కలకలం రేగింది. 2003లో సార్స్ వైరస్ విజృంభించడంతో చైనా, హాంగ్‌కాంగ్‌లలో 650 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే విషయంపై స్పష్టత కొరవడటంతో ప్రస్తుతం చైనా వణికిపోతోంది. ఇప్పటి వరకూ 41 మంది దీని బారినపడ్డట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు ఇప్పటికే పిలుపునిచ్చింది. మరోవైపు భారత్ కూడా చైనా పర్యటనకు వె్ళలే వాళ్లకు దీనిపై అలర్ట్ చేసింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference