రాజధానిని తరలిస్తామంటూ అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలకు దారి తీశాయి. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసేందుకే సిద్ధమైంది. సీఆర్డీఏను రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజధానికి సంబంధించి కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతున్న నేపథ్యంలో, బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్న టీడీపీ… సీఆర్డీఏ రద్దుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. దీంతో, అభివృద్ధి వికేంద్రీకరణకు మీరు వ్యతిరేకమా? అని వైసీపీ ప్రశ్నించింది. మరోవైపు, మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.బీఏసీ సమావేశానికి వైసీపీ తరపున జగన్, బుగ్గన, శ్రీకాంత్ రెడ్డి హాజరుకాగా… టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సమావేశానికి స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షత వహించారు.