హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి భార్యను పుట్టింటికి పంపి, ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంషీగూడలో ఉండే సతీశ్ (35), సంధ్యారాణి భార్యాభర్తలు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. సతీశ్ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుండగా, సంధ్యారాణి గృహిణి. సంక్రాంతి సందర్భంగా తాను తర్వాత వస్తానంటూ ఈ నెల 11న భార్య సంధ్యారాణి, పిల్లలను మిర్యాలగూడలోని ఆమె పుట్టింటికి పంపించాడు. తర్వాత వస్తానన్న భర్త రాకపోవడంతో ఈ నెల 13న సతీశ్‌కు భార్య ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో అనుమానం వచ్చిన ఆమె నిన్న షంషీగూడ వచ్చింది. అక్కడ తమ ఇంటిని భర్త ఖాళీ చేసినట్టు ఇరుగుపొరుగువారు చెప్పడంతో సంధ్యారాణి షాకైంది. దీంతో ఆమె కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.