ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర శాసనసభ నిన్న ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే మూడు రాజధానుల అవసరమని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చెప్పారు. మరోవైపు, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన ఇండియా టీవీ ఓ సర్వేను ట్విట్టర్ వేదికగా నిర్వహించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసనపరమైన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయబోన్నారని… రాజధానులను విభజించడం సరైన ఆలోచనేనా? అంటూ పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో 67 శాతం మంది ప్రజలు మూడు రాజధానుల ఆలోచన సరైనది కాదంటూ జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 29 శాతం మంది సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. 4 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ పోల్ సర్వేను ఇండియా టీవీ దాదాపు 5 గంటల సేపు నిర్వహించింది. దాదాపు 8 వేల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు.