నిన్నమొన్నటి వరకు కిలో రూ.70-రూ.80 పలికిన టమాటా ధర ఇప్పుడు దారుణంగా పతనమైంది. విశాఖపట్టణం జిల్లా కృష్ణదేవిపేట మార్కెట్‌లో నిన్న కిలో టమాటాలను రూపాయికి కూడా కొనేవారు లేకపోయారు. టమాటా దిగుబడులు ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు రైతులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు పోటెత్తిన టమాటాలను కొనేవారు లేక రైతులు సాయంత్రం వరకు ఎదురుచూశారు. 30 కిలోల (క్రేటు) టమాటాలను రూ.30కి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు. చివరికి పోగులుగా పోసి విక్రయించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను చూసి సంబరపడ్డామని, కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపోయామని వాపోయారు.