అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై గెలిచిన తరువాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ హుందాతనాన్ని మరచిపోయి, వారి దేశం పరువును మంటగలిపారు. టోర్నీ గెలిచిన తరువాత, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన సమయంలో తుంటరి చేష్టలకు దిగి, చెడ్డ పేరు తెచ్చుతున్నారు. వాళ్ల అతి ప్రవర్తనను అడ్డుకునేందుకు భారత కోచ్, అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది. నిన్న మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుని వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. జెంటిల్ మెన్ గేమ్ గా పేరున్న క్రికెట్ లో, విజయం తరువాత, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అభివాదం చేయడం సాధారణంగా చూసేదే. కానీ అందుకు భిన్నంగా బంగ్లా యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా పేస్ బౌలర్ షరిఫుల్ ఇస్లామ్, టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆటగాడు తిడుతూ, గొడవకు దిగాడు. ఈ సమయంలో భారత ఆటగాళ్లు కూడా దీటుగా బదులిచ్చేందుకు ముందుకు రావడంతో షరీఫుల్ కిందపడ్డాడు. ఆ వెంటనే కల్పించుకున్న అంపైర్లు ఇరు జట్ల మధ్యకూ వచ్చి, గొడవను సద్దు మణిగేలా చేశారు.
ఇక ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తప్పు చేసింది బంగ్లాదేశ్ ఆటగాళ్లేనని స్పష్టమవుతూ ఉండటంతో, పలువురు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరహా చర్యలు తగవని, క్రికెట్ లో ఎదగాల్సిన పిల్లలు ఇలా గొడవకు దిగడం ఏంటని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు కొందరు వ్యాఖ్యానించారు.