లాక్ డౌన్ కట్టడి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ప్రకటించింది. ముఖ్యంగా నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలుకోసం జనం ఎగబడిపోతుండడం చూసి అనవసర రద్దీని నివారించేందుకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలను సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఎం.కృష్ణ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు.వారు తెలిపిన వివరాల మేరకు… ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు, పాలవిక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో తమ నివాసిత ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాల వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వెళ్లాలి. అయితే గుంపులుగా జనం కొనుగోళ్లకు ఎగబడకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ అమలు విషయంలో సమస్యలుంటే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. విదేశీయులు, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలపై నిఘా ఉంచాలి. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారి కుటుంబాలను ఐసోలేషన్ వార్డుల్లో ఉంచాలి. విదేశీయుల కదలికలు, వైద్య చికిత్సల సమాచారం తెలిస్తే 104 ద్వారా ప్రజలు కూడా తెలియజేయవచ్చు.నిత్యావసరాల సరఫరా చేసే వాహనాలను తిరిగేందుకు అనుమతించాలి. రైతుబజార్లకు కూరగాయలు తరలించేందుకు, నిత్యావసరాలు తరలించేందుకు ఆర్టీసీ బస్సుల సేవలు అందుబాటులోకి తేనున్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ప్రజలకు తెలిసేలా చేయడంతోపాటు ఆ పట్టికలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పక్కాగా నిషేధం అమల్లో ఉంటుంది.