కుమారస్వామి .. సర్పరూపంలో జన్మించడం వలన ఆయనను సుబ్రహ్మణ్యస్వామిగా ఆరాధిస్తూ వుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకునే ఆలయాలు వున్నాయి. ఇక ఉపాలయాలలోను ఆ స్వామి కొలువై దర్శనమిస్తుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటిగా ‘నడుపూడి’ కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో .. రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.
స్వామివారు సర్పరూపంలోను .. శ్రీ వల్లీ దేవసేన సమేతంగాను దర్శనమిస్తుండటం ఇక్కడి విశేషం. స్వామివారిని దర్శించుకోవడం వలన .. పూజాభిషేకాలు జరిపించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సర్పదోషంతో బాధలు పడుతున్నవారు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి సుబ్రహ్మణ్యుడు మహిమాన్వితుడు అంటూ తమకి ఎదురైన అనుభవాలను భక్తులు చెప్పుకుంటూ వుంటారు.