పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతు పలికిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకం అన్నట్లు మాట్లాడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం, విపక్ష డీఎంకే అధికార పార్టీ తీరుపై విరుచుకు పడుతుండడంతో పళనిస్వామి ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ విషయంలో పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
‘ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అంటూ తిరుచ్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి సూచాయగా ప్రకటించడం గమనార్హం. అదే సమయంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)తో ఎటువంటి ఇబ్బంది లేదని, భాష, తల్లిదండ్రుల జన్మస్థలం, ఆధార్, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు వంటి పత్రాల్లో సమాచారం ఐచ్ఛికమని కేంద్రం ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని మైనార్టీలకు అన్ని విధాలా భద్రత కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని, రాజకీయ కారణాలతో ఎన్‌ఆర్‌సీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సీఎం కోరారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా తనను విమర్శిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తమకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.