contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దిగజారుతోంది – ఎపి పై ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన కథనం

ఏపీలో కొత్తగా మూడు రాజధానుల బిల్లు తెరపైకి వచ్చిన నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ విశ్లేషణాత్మక సంచలన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని… కానీ, అమరావతితో రాష్ట్రం పురోగమించిందని తన కథనంలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎక్కువగా ఉన్నప్పటికీ… హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం ఆ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా మార్చిందని తెలిపింది. అయితే, ఏపీ మాత్రం ధనికులు ఉన్న పేద రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందని చెప్పింది. అయినా, పేద రాష్ట్రమైనప్పటికీ ఏపీ పురోగమిస్తుందనే అంచనాలు మాత్రం అందరిలో ఉండేవని తెలిపింది.

హైదరాబాదులో అత్యధిక వ్యాపారాలు చేస్తున్నవారు ఏపీకి చెందినవారని… అందువల్ల వారంతా తమ కొత్త రాష్ట్రం నవ్యాంధ్ర అభివృద్ధిని తమ భుజాలపై వేసుకుని ఏపీ బాట పట్టారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. వారి అండతో, ఆంధ్రుల మేధస్సుతో, అప్పటి ప్రభుత్వ సహకారంతో ఏపీ త్వరిత గతిన అభివృద్ధి బాట పట్టిందని చెప్పింది. రాజధానిగా అమరావతి ఏర్పాటైన తర్వాత ఏపీ అభివృద్ధి మరింత వేగవంతమైందని పేర్కొంది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి దిగజారుతోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉన్న రాజధానిని గందరగోళంగా మార్చేశారని… ఏది సరైన రాజధానో నిర్ణయించలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక సరైన, నిర్దిష్టమైన కారణం లేకుండానే అమరావతిని మారుస్తున్నారని విమర్శించింది.

అమరాతి రాజధానిగా కొనసాగితే టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా లబ్ధి పొందుతారని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానించింది. బినామీ పేర్లతో టీడీపీ వర్గీయులు భూములు కొన్నారనే భావనలో ఉన్న ప్రభుత్వం… రాజధానిని అమరావతి నుంచి మార్చితే టీడీపీకి చెందిన సంపన్న శ్రేణులను కొంతమేర దెబ్బతీయవచ్చని భావిస్తోందని తెలిపింది. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగుపడతాయని జగన్ ప్రభుత్వం చెబుతోందని తెలిపింది. ఏపీ లాంటి కొత్త రాష్ట్రానికి ఒక రాజకీయ స్థిరత్వం అవసరమని… ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిని మార్చాలనుకోవడం ఒక మోసకార నిర్ణయమని పేర్కొంది. ఒక్క రాజధానినే నిర్మించడానికి డబ్బులు లేవని చెబుతున్న తరుణంలో… మూడు రాజధానుల నిర్మాణానికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది.

పొలిటికల్ కామెంటేటర్ ‘అమి చువా’ రచించిన ‘పొలిటికల్ ట్రైబ్స్: గ్రూప్ ఇన్స్టింక్ట్ అండ్ ది ఫేట్ ఆఫ్ నేషన్స్’ పుస్తకంలోని ‘మార్కెట్ ను శాసించే మైనార్టీలు’ అనే పదాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉటంకించింది. వ్యాపార రంగంలో మంచి శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు కలిగిన కొన్ని సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు… ప్రతి ఒక్క అవకాశాన్ని సంపాదన కోసమే ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ‘మార్కెట్ ను శాసించే మైనార్టీలు’ అనే పదాన్ని ఉపయోగించడం గమనార్హం.దీనిపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానిస్తూ… కొత్త రాజధాని నిర్మాణం కూడా ఈ కోవలోకే వస్తుందని… వ్యాపారవేత్తల సంపాదన కోసమే కొత్త రాజధాని నిర్మాణం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోదనే భావిస్తున్నట్టు తెలిపింది. అయితే, పలు కారణాల నేపథ్యంలో మార్కెట్ ను శాసించేవారిని ప్రభుత్వాలు దూరం పెట్టలేవని… ఒకవేళ దూరం పెట్టినా ఏపీలాంటి కొత్త రాష్ట్రాలకు సరికొత్త ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడింది.

దేశావృద్ధిలో నగరాలది కీలక పాత్ర అని… ఏ రాష్ట్రానికైనా తమ రాజధాని ఏదనే విషయంలో పూర్తి స్పష్టత ఉండాలని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ స్పష్టత లోపిస్తే… పెట్టుబడులు, స్టార్టప్ లు, ప్రజలు, టాలెంట్ ఆ రాష్ట్రాలకు రావని పేర్కొంది. మన దేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య విపరీతమైన పోటీ ఉందని… రాజధాని లేని ఏపీ ఈ రేసులో లేనే లేదని స్పష్టం చేసింది. రాజధాని కోసం అమరావతి ప్రాంతం, విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయని… అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపింది. సీఎం జగన్ ఇంకా హానీమూన్ పీరియడ్ లోనే ఉన్నారని… వైసీపీ మద్దతుదారులు కూడా జగన్ నిర్ణయాలను సీరియస్ గా తీసుకోవడం లేదని పేర్కొంది.  ఏదేమైనప్పటికీ అమరావతి అంశంతో ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు కలిసొస్తున్నాయని, అమరావతి నష్టం, హైదరాబాదుకి లాభం కలిగిస్తోందని పేర్కొంది. ఏపీకి చెందిన వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని… వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భయపడాల్సిన అవసరం లేదనే భరోసా ఇస్తోందని తెలిపింది. ఏపీ టాలెంట్ మొత్తం ఇప్పుడు మళ్లీ హైదరాబాదుకే తిరిగి వెళ్తోందని తెలిపింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఏపీకి కష్టతరమేనని అభిప్రాయపడింది. ఈ కథనానికి జగన్, కేసీఆర్ లు కలిసి ఉన్న ఫొటోను పెట్టడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :