contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం…. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?

500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు.. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా..

మన కాంభోజ రాజ్యం
ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగ్ కోర్ వాట్ ఆలయం.. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంభోజ రాజ్యంగా పేర్కొనేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు.

ప్రపంచంలోనే అతి పెద్ద నగరం కూడా..
అంగ్ కోర్ నగరంలో అప్పట్లోనే ఇక్కడ పది లక్షల మంది వరకు నివసించినట్టు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్ కోర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్టుగా గుర్తించారు. అంగ్ కోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు. ప్రస్తుతం అంగ్ కోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తోంది.

ఆలయాల నగరం..
అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అసలు అంగ్ కోర్ వాట్ అంటేనే.. దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం.

మేరు పర్వతాన్ని తలపించేలా..
హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్ కోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల (65 మీటర్ల) ఎత్తయిన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి.
– దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల (200 మీటర్లు) వెడల్పుతో 13 అడుగుల (నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం.
– ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు.
– ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం గమనార్హం.
– ప్రధాన గోపురం కింది గదుల్లో అద్భుతమైన పెయింటింగులు ఉన్నాయి. ఖ్మేర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ, మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిల్లో చిత్రించారు.
– అంగ్ కోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఆ నిర్మాణం ఏమిటన్నది ఇప్పటికీ నిర్ధారించలేదు.

బౌద్ధారామంగా మారిన విష్ణుమూర్తి ఆలయం
అంగ్ కోర్ వాట్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అయితే ఖ్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది. ఆ సమయంలోనే.. అంటే సుమారు 14వ శతాబ్దం సమయంలో అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అంగ్ కోర్ వాట్ లో అప్పటి ఉన్న శిల్పాలను, ఆలయాలను ఏమాత్రం మార్చకుండే కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగ్ కోర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :