బీజేపీ మేయర్ పై కాల్పులు - తృటిలో తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్ర నాగపూర్ మేయర్, బీజేపీ నేత సందీప్ జోషిపై హత్యా యత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా… ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. నాగపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపారని చెప్పారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నాయి. కాల్పులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నాగపూర్ మేయర్ గా సందీప్ జోషి పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టెను కూడా ఏర్పాటు చేశారు. ఈ బాక్స్ లోనే సందీప్ ను చంపేస్తామంటూ ఈ నెల 6న ఓ లేఖ వచ్చింది. లేఖ వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. దాడికి పాల్పడినవారు ముంబైకి చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post