అలీగఢ్ యూనివర్శిటీలో ఎవరూ ఉండటానికి వీల్లేదు:ఉత్తరప్రదేశ్ డీజీపీ వార్నింగ్

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన కార్యక్రమాలు విశ్వవిద్యాలయాలకు చేరాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో… పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో… పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జేఎంఐ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులతో విద్యార్థులు గొడవ పడ్డారు. విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో, అలీగఢ్ లో నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు ఇటర్నెట్ సేవలను ఆపేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి ప్రకటించారు. మరోవైపు, యూనివర్శిటీని తక్షణం అందరూ ఖాళీ చేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశించారు. విద్యార్థులందరినీ ఇంటికి పంపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. హింసాత్మక చర్యలు చేపట్టే ఏ ఒక్కరినీ తాము ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. యూనివర్శిటీని జనవరి 5వ తేదీ వరకు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post