ఏసీబీ కి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి

అయినవిల్లిలంక వీఆర్వో పట్టేం నాగేశ్వరరావు వీరవల్లిపాలెం గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జ్‌ వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వట్టికూటి సత్యనారాయణ పేరున పది సెంట్ల కొబ్బరి తోట ఉంది. మ్యుటేషన్‌ చేసి తన కుమారుడు కట్టికూటి కేదారేశ్వరరావు పేరున పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించాలని 2019 అక్టోబర్‌ 22న మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు పాసు పుస్తకం ఇవ్వడానికి రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని అడిగాడు. ఆ సొమ్ము ఇవ్వడానికి ఇష్టపడని వట్టికూటి సత్యనారాయణ కుమారుడు కేదారేశ్వరరావు స్పందనలో టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో కేదారేశ్వరరావుతో ఏసీబీ అధికారులు సంప్రదింపులు జరిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు వి.పుల్లారావు, తిలక్, మోహనరావులతో అయినవిల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్‌ నిర్వహించారు. అక్కడ కేదారేశ్వరరావు నుంచి వీఆర్వో నాగేశ్వరరావు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులు సీజ్‌ చేశారు. నాగేశ్వరరావు తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వివరాలు నమోదు చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post