శభాష్... లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోందని, ఇందుకు అధికారులు, పోలీసు వ్యవస్థకు అభినందనలు తెలుపుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, పక్కాగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిన్న రాత్రి పది గంటల వరకూ తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన ఆయన, పలువురు సీనియర్ అధికారులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే, ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, సామాజిక దూరాన్ని పాటించడమే మన ముందున్న ఉత్తమ మార్గమని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న వారిని మరింత జాగ్రత్తగా కనిపెట్టాలని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం అవుతుండటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ప్రజలు మరింతగా సహకరిస్తే, రాష్ట్రాన్ని తొందరగా వైరస్ బారి నుంచి బయట పడవేయవచ్చని అన్నారు. పోలీసు శాఖతో పాటు రేయింబవళ్లు శ్రమిస్తున్న వైద్యులు, శానిటరీ విభాగం సిబ్బందిని అభినందించిన కేసీఆర్, కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా, వెంటనే తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా, ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే రెండు వారాల పాటు ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఉంటే, రాష్ట్రం నుంచి కరోనాను తరిమేసినట్టేనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Previous Post Next Post