గుంటూరు , చిత్తూరు జిల్లాల కలెక్టర్లను , ఎస్పీలను మాచర్ల సీఐలను విధులనుండి తొలగించాలని ఈసీ సిఫార్సు!

  • అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు
  • అవసరమైన చోట్ల ఎన్నికల రీషెడ్యూల్
  • పలువురు అధికారుల బదిలీకి సిఫార్సులు

ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన పలు హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీ ఎలక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. పలు చోట్ల ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపించిందని, వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో వేరొకరిని నియమించాలని ఆయన అన్నారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలనూ ప్రస్తావించారు. మాచర్లలో జరిగిన ఘటన తరువాత, అరెస్ట్ చేసిన వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం, ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేయడం ఆమోదయోగ్యం కాదని, అందుకు ఆ ప్రాంత సీఐదే బాధ్యతని, వెంటనే అతన్ని కూడా విధుల నుంచి తప్పించాలని సిఫార్సు చేస్తున్నట్టు రమేశ్ కుమార్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలు జరిగిన మరికొన్ని ప్రాంతాల పోలీసు అధికారులను కూడా బదిలీ చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తక్షణం బదిలీ చేయాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు. మహిళలు, బలహీన వర్గాల అభ్యర్థులపై దాడులు జరగడం శోచనీయమని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి మరింత అప్రమత్తతను మలిదశ ఎన్నికల్లో ఆశిస్తున్నానని అన్నారు. జరిగిన అన్ని హింసాత్మక ఘటనలనూ పరిశీలిస్తున్నామని, ఈ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఇంతవరకూ జరిగిన ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసి, కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post