టిబెట్ ను దాటి లడఖ్ లోని పలు ప్రాంతాల్లోకి వచ్చేసిన చైనా....సరిహద్దు లో యుద్ధ వాతావరణంతమ అధీనంలో ఉన్న టిబెట్ భూ భాగాన్ని దాటేసి, భారత్ కు చెందిన లడఖ్ లోని పలు సరిహద్దు ప్రాంతాల్లోకి చైనా సైన్యాలు చొరబడ్డాయని నివేదికలు వస్తున్న వేళ, భారత వాయుసేన అప్రమత్తమైంది. ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు లడఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇదే సమయంలో చైనా ఫైటర్ విమానాలు భారత భూభాగంలోకి ఇటీవలి కాలంలో రాలేదని, తమ యుద్ధ విమానాలు నిత్యమూ పహారా కాస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బరోరియా తాజాగా వెల్లడించారు. "మా విమానాలు ఎప్పుడు అవసరమైనా ఎగురుతున్నాయి. పరిస్థితిని బట్టి స్పందిస్తున్నాయి. ఈ విమానాల్లో యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి" అని ఆయన అన్నారు.ఈ విమానాలను పూర్తిగా ఆయుధాలతో నింపి పంపుతున్నామని, టిబెట్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరిగిన తరువాత మరింత అప్రమత్తమయ్యామని ఆయన స్పష్టం చేశారు. "ఏ విధమైన సైనిక కదలికలు కనిపించినా, అందుకు తగ్గట్టుగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నాం. గాల్వాన్ లోయలో మన సైనికుల ప్రాణ త్యాగాన్ని వృథా పోనివ్వబోము" అని ఆయన వ్యాఖ్యానించారు. లడఖ్ లోని భారత గగనతలంపై అపాచీ హెలికాప్టర్లు, అప్ గ్రేడ్ చేసిన మిగ్-29 విమానాలు తిరుగుతున్నాయన్న చిత్రాలు విడుదలైన మరుసటి రోజున బరోరియా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యాధునిక చాపర్ గా పేరున్న అపాచీలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే, పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది భూమిపై ఉన్న యుద్ధ ట్యాంకులను కూడా నాశనం చేయగల సత్తాను కలిగివుంటుంది. వాస్తవాధీన రేఖ వెంబడి, అపాచీ చాపర్లు ఇప్పుడు గస్తీ కాస్తున్నాయి. ఇక మన మిగ్ - 29 విమానాల రక్షణ కోసం సరికొత్త రాడార్ వ్యవస్థను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ఏవియానిక్స్ వ్యవస్థను రష్యా నుంచి ఇండియా అందుకుంది. ఈ రాడార్ వ్యవస్థతో ఒకసారి గాలిలోకి ఎగిరిన విమానం ప్రపంచంలో ఎక్కడుందన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇదే సమయంలో సరికొత్త చినాక్ రవాణా హెలికాప్టర్లను సైతం వాయుసేన లడఖ్ ప్రాంతానికి తరలించింది. ఇవి ఎం-777 ఆర్టిలరీ గన్స్ ను కూడా అవసరమైన ప్రాంతానికి తీసుకెళ్లే సత్తాను కలిగివుంటాయి. మరోవైపు చైనా సైతం సరిహద్దుల్లో విమానాల మోహరింపును పెంచింది. అదనపు సైన్యాన్ని, ఆయుధాలను టిబెట్ మీదుగా తరలిస్తున్నట్టు సమాచారం. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది.
Previous Post Next Post