చైనా యాప్‌లను నిషేధించినట్టు సోషల్ మీడియాలో వార్తలు - అది నకిలీ వార్తన్న ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోచైనాతో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ యాప్స్‌ను ప్రభుత్వం నిషేధిస్తున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టత నిచ్చింది. అది పూర్తిగా తప్పుడు వార్త అని కొట్టిపడేసింది. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ పనితీరును పరిమితం చేయాలంటూ టెక్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చెబుతున్న ఉత్తర్వులు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న నేపథ్యంలో పీఐబీ స్పందించి ఈ విషయంలో స్పష్టత నిచ్చింది.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జారీ చేసినట్టుగా ప్రచారం అవుతున్న ఈ ఉత్తర్వుల్లో.. చైనాకు చెందిన టిక్‌టాక్, లైవ్‌మి, బిగో లైవ్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, కేమ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రోమ్‌వే, యాప్ లాక్, వీమేట్ వంటి 13 యాప్‌లను నిషేధిస్తున్నట్టు ఉంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ ఉత్తర్వు నకిలీదని పీఐబీ పేర్కొంది. దీనిని నమ్మొద్దని, ప్రభుత్వం నుంచి అలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదని స్పష్టం చేసింది.
Previous Post Next Post