చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు - బలగాలను భారీ ఎత్తున తరలిస్తున్న భారత్!గాల్వన్ లోయ వద్ద ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. చైనాతో సరిహద్దుల్లో కీలక స్థానాలుగా భావించే గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ సరస్సు వద్ద ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని జాతీయ భద్రతా మండలి పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో, సమస్యాత్మక ప్రాంతాలకే కాకుండా, 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కేంద్ర వర్గాలంటున్నాయి. సైన్యానికి మద్దతుగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కూడా తన బలగాలను, ఆయుధ సంపత్తిని తరలిస్తోంది. ఉద్రిక్తతలు నెలకొన్న అనేక గస్తీ పాయింట్ల వద్ద చైనా కొత్త నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. ఇప్పటికీ చైనా దూకుడు తగ్గకపోవడం భారత్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.
Previous Post Next Post