ముంబై లో అంతుచిక్కని వాసన - ఆందోళన చెందుతున్న ముంబై వాసులుఇటీవలే వైజాగ్ నగరంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై 14 మంది మృతి చెందిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ముంబయి మహానగరంలో గత అర్ధరాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కూడా ఇంతవరకు పసిగట్టలేకపోయారు. ముంబయిలోని అంధేరి, ఘట్కోపర్, విఖ్రోలీ, చెంబూర్  తదితర ప్రాంతాల్లో భరింపరాని వాసన వస్తుండడంతో ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు.దాంతో అధికారులు గ్యాస్ లీక్ గా భావించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వారికి తోడు 17 ఫైరింజన్లు కూడా ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కనిపెట్టేందుకు విఫలయత్నం చేశాయి. అంతేకాదు, ప్రమాదకర రసాయన పదార్థాలను గుర్తించే హజ్మత్ వాహనాన్ని కూడా తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలోని రసాయన పరిశ్రమలు, చమురు కంపెనీలను పరిశీలించినా అసలు ఆ వాసన ఎక్కడ్నించి వస్తున్నదో కూడా గుర్తించలేకపోయారు. అయితే, ఇది గ్యాస్ లీక్ వాసన అయ్యుండదని భావిస్తున్న అధికారులు, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
Previous Post Next Post