మంగళవారం నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు  సరిహద్దు జిల్లాల్లో ఉద్రుత వాతావరణం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరణ్య ప్రాంతంలో ముఖ్యంగా భద్రాచలం మరియు మనుగురు డివిజన్లలో ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది.1972 జూలై 28న మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు చార్ మజుందార్ ఎన్కౌంటర్లో మృతి చెందిన తేదీ నుండి మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా జూలై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మావోయిస్టులు అమరులైన వారిని స్మరించుకుంటూ, నివాళులర్పిస్తూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల విజయవంతం చేయాలంటూ సరిహద్దు మండలాలలో మావోయిస్టులు ఇప్పటికే కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు. మావోయిస్టు వారోత్సవాలు నేపధ్యంలో ఏజెన్సీలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు.  మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పరిధిలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. భద్రాద్రి జిల్లా  పరిధిలోని చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అటవీ గ్రామాలలో గత కొన్ని రోజులుగా సీఆర్ఫీయఫ్, గ్రేహేండ్స్ బలగాలతో పోలీసులు అనునిత్యం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గొత్తికోయ గూడెలలో సోదాలు చేస్తున్నారు. నూతన వ్యక్తులు సంచరిస్తున్నారా అని అక్కడి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానితులకు, ముఖ పరిచయం లేని వారికి ఆశ్రయం ఇవ్వవద్దని, నక్సలైట్లకు సహకరించవద్దని అక్కడి వారిని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి పక్క జిల్లా ములుగు జిల్లాలో  వాజేడు , వెంకటాపురం మండలాలలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల గ్రామాల మీదుగా పడవలు, నావలపై చత్తీస్ఘడ్ నుండి   గోదావరి నది దాటి ములుగు అటవీప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో పక్క జిల్లాలోని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలతో గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద తనిఖీల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో గ్రామాలలోని, మండల కేంద్రాలలోని ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను పోలీసులు అప్రమత్తం చేశారు. గత పది రోజుల నుండి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలోని సరిహద్దు మండలాలలో మావోల కదలికలు బయటపడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిపై, చర్ల మండలంలోని గుంపెనగూడెం, రాళ్ల గూడెం, లెనిన్ కాలనీ తదితర ప్రాంతాలలో మావోయిస్టుల పేరిట ఇటీవల కరపత్రాలు వెలిశాయి. ఐదు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బత్తినపల్లిలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు సంబందించిన రోడ్డు రోలర్, ట్రాక్టర్ను మావోయిస్టులు తగులబెట్టారు. గత పది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో మల్లెతోగు అడవులలో  పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరగడం వంటి సంఘటనలుఉన్నాయి.  ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికి చాటేందుకు ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశాలు ఉండడంతో వారోత్సవాలు ముగిసే వరకు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని టార్గెట్లకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు తెలియకుండా అటవీ గ్రామాలలో పర్యటనలకు వెళ్లవద్దని, సాధ్యమైనంతవరకు వారోత్సవాలు ముగిసే వరకు అటవీ ప్రాంతాలలో పర్యటనలను రద్దు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఏజెన్సీలోని పోలీసులు సూచించినట్లు సమాచారం. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల విజయవంతం చేయాలని ఒక ప్రక్క మావోయిస్టులు పిలుపునివ్వడం, మరోపక్క పోలీసులు నిత్యం అడవి గ్రామాల్లో సోదాలు, తనిఖీలు నిర్వహించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని ఏజన్సీ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post