జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల దాడిలో... తెలంగాణ జవాన్ వీరమరణం..తెలంగాణకు చెందిన మరో జవాను వీరమరణం చెందాడు. నిన్న శ్రీనగర్ సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ వీరమరణం పొందారు . అతని వయసు 28 సంవత్సరాలు. ఏడు సంవత్సరాల క్రితం సైన్యంలో చేరిన శ్రీనివాస్, వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ పరిధిలోని సరిహద్దుల్లో విధుల్లో ఉన్నారు. నిన్న తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేయగా, వారిని ఎదుర్కొనే క్రమంలో శ్రీనివాస్ తన ప్రాణాలకు తెగించి పోరాడుతూ, తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. కాగా, కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు స్వగ్రామానికి వచ్చిన శ్రీనివాస్, లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తరువాత జూన్ 4న విధులకు వెళ్లి, 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి, తనలో వైరస్ లేదని నిర్ధారించుకుని విధుల్లో చేరి, ఇలా హఠాన్మరణం చెందాడు.

శ్రీనివాస్ కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది. అతని మృతి విషయం తెలుసుకున్న నాగెపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు. అతని మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
Previous Post Next Post