బీహార్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా రంగంలోకి నరేంద్ర మోదీ..

 


బీహార్  లో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడ్డాయి. తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. నేటి నుంచి రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించి, పలు ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ససారమ్, గయ, భాగల్ పూర్ ప్రాంతాల్లో మోదీ ర్యాలీ జరుగనుంది. బీజేపీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, మొత్తం 12 ర్యాలీల్లో పాల్గొనే మోదీ, ఎన్డీయే తరఫు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు. 28న దర్భంగా, ముజఫర్ పూర్, పట్నాల్లో, నవంబర్ 3న ఛాప్రా, ఈస్ట్ చంపారన్, సమస్తిపూర్ ప్రాంతాల్లోనూ, ఆపై వెస్ట్ చంపారన్, సహస్ర, అరారియా తదితర ప్రాంతాల్లో మోదీ ప్రచారం సాగనుంది.జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థి పోటీ చేస్తున్న ససారమ్ నుంచి మోదీ ప్రచారం ప్రారంభం అవుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, బీహార్ లో తొలి దశ పోలింగ్ 28వ తేదీ బుధవారం జరుగనుండగా, అదే రోజున మోదీ రెండో రౌండ్ విడత ప్రచారం ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలకు అధికంగా ప్రజలను తరలించకుండా, రాష్ట్రమంతా డిజిటల్ ప్రసారాలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం ఐదు గ్రామాల్లో ప్రత్యేక ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి, మోదీ ప్రసంగాలను ప్రత్యక్షంగా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ర్యాలీలన్నీ భౌతిక దూరం పాటిస్తూనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post