59 చైనా యాప్​ లపై శాశ్వత నిషేధం! టిక్  టాక్, బైదు, వియ్ చాట్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ వీడియో కాల్ సహా 59 చైనా యాప్ లను కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా నిషేధించింది. ఇప్పటికే గత ఏడాది జూన్ లో ఆ యాప్ లు సహా 267 యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.భారత సార్వభౌమత్వం, సమగ్రత, భారత రక్షణ, దేశ, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం వాటిని నిషేధించింది. వివరణ ఇవ్వాలని యాప్ లకు నోటీసులు ఇచ్చింది.అయితే, తాజాగా ఆయా యాప్ ల యాజమాన్యాలు ఇచ్చిన సమాధానంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సమాచార సేకరణ, సమాచార ప్రాసెసింగ్, సమాచార భద్రత, గోప్యత వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సంస్థలు సరైన సమాధానం చెప్పలేదని, దీంతో 59 యాప్ లపై శాశ్వత నిషేధం విధించాల్సి వచ్చిందని ఓ అధికారి చెప్పారు. నిషేధానికి గురైన యాప్ లలో షేర్ ఇట్, లైకీ, వీబో, షావోమీ ఎంఐ కమ్యూనిటీ, బిగో లైవ్ వంటి యాప్ లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.తూర్పు లడఖ్ లోని సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు గొడవల్లో అమరులయ్యారు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దేశ ప్రజల డేటా తీసుకుంటున్న చైనా కంపెనీలపై వేటు వేసింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post