బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య!

 


వివాహం చేసుకోవాల్సిందేనని భర్తను వదిలేసిన ఓ యువతి చేస్తున్న వేధింపులకు తాళలేక, సెలవుల నిమిత్తం వచ్చిన ఓ బీఎస్ఎఫ్ జవాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది.పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన గెడాం మారుతి (30) భారత సరిహద్దు దళంలో పనిచేస్తున్నాడు. మేఘాలయలోని 11వ బెటాలియన్ లో పని చేస్తున్న ఆయన, గత నెలలో సెలవుపై ఇంటికి వచ్చాడు.ఈ క్రమంలో మారుతికి వివాహం చేయాలని నిర్ణయించిన కుటుంబ పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మారుతికి గతంలో పార్వతీబాయి అనే మహిళతో పరిచయం ఉంది. ఆమెకు వివాహమై, ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. తన సమీప బంధువుతో కలసి మారుతిని కలిసిన ఆమె, తనను పెళ్లి చేసుకోవాలని గొడవ చేసింది.దీనిపై బుధవారం నాడు గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించారు. పార్వతీ బాయితో తనకు సంబంధం లేదని, వివాహం చేసుకోబోనని స్పష్టం చేశాడు. ఆపై మారుతిపై పోలీసు కేసు పెడతానని ఆమె బెదిరింపులకు దిగింది. జరిగిన ఘటనలతో ఇంటి పరువు పోయిందన్న మనస్తాపంతో రాత్రి బయట పడుకుంటానని చెప్పిన మారుతి, ట్రాక్టర్ లో ఉంచిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం ఇంట్లో వారు చూసేసరికే అతను మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post