ఒకే గ్రామంలో సగం మందికి కరోనా! ... చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ వదిలేసారు

 


కరోనా సోకిందన్న విషయం తెలుసు. అయినా, వారు ‘మాకేం’ అనుకున్నారు. ఇటు అధికారులూ ‘మాకెందుకులే’ అన్న చందాన వ్యవహరించారు. దీంతో పాజిటివ్ వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు ఊర్లో విచ్చలవిడిగా తిరిగేశారు. తమతో పాటు ఊరి జనాల ప్రాణాలను ముప్పులో పడేశారు. ఆ గ్రామంలో ఇప్పుడు సగానికి సగం మంది మహమ్మారి బారిన పడ్డారు. కర్ణాటకలోని బెళగావి జిల్లా అబనాళి గ్రామంలోని పరిస్థితి ఇది. 300 మంది ఆ గ్రామంలో నివసిస్తుండగా 144 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ గ్రామం గోవా, మహారాష్ట్రలకు సరిహద్దుల్లో ఉంటుంది. దీంతో పనుల కోసం ఆ ఊరి ప్రజలు అక్కడికి వెళుతుంటారు. అయితే, కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉండలేక ప్రజలు తమ సొంతూరికి తిరిగొచ్చేశారు. ఈ నెల 10న ముగ్గురు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లారు. టెస్టులు చేయగా కరోనా ఉన్నట్టు తేలింది. అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారిని కలిసిన వారి వివరాలూ తీసుకోలేదు. వారు ఎక్కడున్నారో జాడ కూడా కనిపెట్టలేదు. దాంతో పాటు పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్ లోనూ ఉండలేదు. పాజిటివ్ అని తెలిసినా ఊరంతా విచ్చలవిడిగా తిరిగేశారు. దీంతో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఒక్కరోజే 20 మంది దాకా మహమ్మారి బారిన పడడంతో అసలేమైందో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటేనే గ్రామస్థులకు కరోనా యాంటీజెన్ టెస్టులు చేయగా 144 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. లక్షణాలుండి నెగెటివ్ వచ్చిన మరికొందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, ఫలితాలు వచ్చాక ఊరిని ‘కంటెయిన్’ చేస్తామని చెప్పారు. అయితే, ఆర్టీపీసీఆర్ టెస్టుల తర్వాత కేసులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 0/Post a Comment/Comments

Previous Post Next Post