WORLD

ప్రియుడు మోసం చేశాడంటూ … వెంటాడి చంపిన యువతి

అమెరికాలో ఓ యువతి ప్రియుడు మోసం చేశాడంటూ అతడిని కిరాతకంగా అంతమొందించింది. ఇండియానాపొలిస్ లో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు గైలిన్ మోరిస్. 26 ఏళ్ల గైలిన్ కొంతకాలంగా తన ప్రియుడు ఆండ్రే స్మిత్ పై కోపం పెంచుకుంది. ఇటీవల అతడు మరో స్త్రీతో కనిపించినప్పటి నుంచి భగ్గుమంటోంది. స్మిత్ తనను మోసం చేస్తున్నాడని భావించిన ఆ యువతి అతడ్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది.

దాంతో అతడి వస్తువులపై ఓ ఆపిల్ ఎయిర్ టాగ్ (చిన్న బటన్ వంటి పరికరం) ఫిక్స్ చేసింది. దాంతో అతడి ఆచూకీ ఆమెకి ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. ఈ క్రమంలో ప్రియుడు ఆండ్రే స్మిత్ ఓ బార్ వద్ద ఉన్నాడని ఆపిల్ ఎయిర్ టాగ్ డేటా వెల్లడించడంతో, గైలిన్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి వెళ్లింది. అతడితో పాటు మరో మహిళ కూడా కనిపించడంతో ఓ ఖాళీ వైన్ సీసాతో దాడికి దిగింది.

అయితే బార్ సిబ్బంది జోక్యం చేసుకుని, వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ బార్ ఎదుటే తన కారుతో అతడ్ని ఢీకొట్టి కడతేర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసుల గైలిన్ మోరిస్ ను అరెస్ట్ చేశారు.

ఇంతకీ గైలిన్ ఉపయోగించిన ఆపిల్ ఎయిర్ టాగ్ ఎలా పనిచేస్తుందంటే… ఇది ఓ జీపీఎస్ వంటిదే. దీన్ని ఆపిల్ ఫోన్, ఐపాడ్ వంటి సాధనాల ద్వారా నియంత్రించవచ్చు. ఈ ఎయిర్ టాగ్ ను ఏదైనా వస్తువుకు అంటిస్తే…. ఆ వస్తువును ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు. ‘ఫైండ్ మై’ అనే యాప్ లో సదరు ఎయిర్ టాగ్ డేటా చూసుకోవచ్చు. గైలిన్ కూడా ప్రియుడిపై అనుమానంతో ఈ ఎత్తుగడనే అమలు చేసింది. ఎయిర్ టాగ్ కచ్చితంగా అతడిని పట్టివ్వడంతో ఆగ్రహం పట్టలేక అతడిని అక్కడికక్కడే కారుతో కసిగా మూడుసార్లు తొక్కించేసి చంపేసింది.