ANDHRA PRADESH POLITICS

సొంత పార్టీ వాళ్లే వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారు : వైసీపీ కీల‌క నేత బాలినేని

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో కీల‌క నేత‌, పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌మీప బంధువుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌న సొంత పార్టీ నేత‌ల‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై సొంత పార్టీ వాళ్లే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న సోమ‌వారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అలా సొంత పార్టీలో ఉంటూనే త‌న‌పై కుట్ర‌లు చేస్తున్న వారెవ‌రో త‌న‌కు తెలుసున‌ని చెప్పిన బాలినేని… వాళ్ల సంగ‌తి చూస్తానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

త‌న‌ను టార్గెట్ చేస్తున్న వారితో త‌న పార్టీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని కూడా బాలినేని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాకుండా రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని కూడా బాలినేని చెప్పారు. ఓ కేసు విషయంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తితోనే కేసులు ఉప‌సంహ‌రించుకున్నట్లు ఆయ‌న వివ‌రించారు.