EDUCATION NATIONAL TELANGANA VIDYA

కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ ను ఆగస్టు 4న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు (ఆగస్టు4,2022) సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. కమాండ్ కంట్రోల్‌ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ టవర్స్‌ను నిర్మించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ద్వారా తెలంగాణ వ్యాప్తంగా డేగ కన్నుతో పోలీసుల పహారా ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ..జీ-ప్లస్ 20 అంతస్తుల్లో ఈ టవర్ ను ఏర్పాటు చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ Aలో ఇరవై అంతస్తులను నిర్మించారు. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్‌ A పైభాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. టవర్‌ Bలో 15 అంతస్తులు ఉన్నాయి. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండనుంది. టవర్‌ Cలో మూడు ఫ్లోర్‌లు ఉన్నాయి. ఇందులో ఆడిటోరియంగా పోలీసులు వినియోగించనున్నారు.

టవర్‌ Dని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్‌ కోసం ఉపయోగించనున్నారు. మొత్తం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టవర్ A, టవర్ B కీలకంగా ఉండనుంది. టవర్‌ Eలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూచే వెసులుబాటు ఉంది. కమాండ్ కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక మ్యూజియం ఉండనుంది. పోలీస్ డిపార్టమెంట్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకునే వెసులుబాటు ఉంది.

7 ఎకరాల విస్తీర్ణంలో..
ఈ కమాండ్ సెంటర్ భవనాన్ని లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రదేశాన్ని 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు అని పోలీసులు అంటున్నారు. ఈ భవనం నిర్మాణం కోసం రూ.350 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టగా, తర్వాత మరో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ భవనాన్ని 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో A, B, C, D కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్లు నియమించారు. టవర్-A గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. టవర్-B, C, Dలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో నిర్మించారు. సీసీసీలో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-A, హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్-A నిర్మించారు. ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు సీసీసీలో ఉంటాయి.

సీసీసీ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉన్నాయి. పోలీస్ టవర్స్ ప్రారంభం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత రద్దీ ఉండనుంది..వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ద్వారా వెళ్లే వాహనదారులంతా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ మీదుగా వెళ్లాలని తెలిపారు.