TECHNOLOGY WORLD

చేతికి ఆపరేషన్‌ చేసుకుని కారు తాళం పెట్టేసుకున్నాడు .. చిత్రమైన పని.. వీడియో ఇదిగో..

కారో, బైకో ఏదైతేనేం.. అప్పుడప్పుడూ తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. ఒక్కోసారి వెతికివెతికి చిరాకు కూడా వేస్తుంటుంది. మరి ఈ తంటా ఎందుకు అనుకున్నాడో ఏమో అమెరికాకు చెందిన యూట్యూబర్ బ్రాండన్ దలాలీ చిత్రమైన పని చేశాడు. తన చేతికి ఆపరేషన్ చేయించుకుని కారు తాళం పెట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

ఎలక్ట్రానిక్ కీ అవడంతో..

  • బ్రాండన్ వాడేది టెస్లాకు చెందిన ఆధునిక ఎలక్ట్రిక్ కారు. దానికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ కీ ఉంటుంది. దాన్ని ఇన్ సర్ట్ చేయాల్సిన పని ఉండదు. కేవలం కారు డోర్ వద్ద ట్యాప్ చేస్తే అన్ లాక్ అవుతుంది.
  • కారు లోపల కూడా ఆ కీని ఉపయోగించే స్టార్ట్ చేయడం, ఇతర పనులు చేయడం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బ్రాండన్ సదరు ఎలక్ట్రానిక్ కీని తన కుడి చేతి మణికట్టు పై భాగంలో చిన్న ఆపరేషన్ చేయించుకుని ఫిట్ చేయించేసుకున్నాడు.
  • ఇందుకోసం సదరు వైద్య నిపుణుడికి 400 డాలర్లు (మన కరెన్సీలో రూ.32 వేలు) చెల్లించాడు.
  • కారు దగ్గరికి వెళ్లిన బ్రాండన్ కేవలం తన చేతి మణికట్టును డోర్ కు దగ్గరగా అటూ ఇటూ కదిలిస్తే అన్ లాక్ అయిపోయింది.
  • కారు లోపల కూడా సెన్సర్లు ఉన్న భాగంలో తన చేతిని పెట్టగానే స్టార్ట్ అవడం, ఆఫ్ అయిపోవడం, ఇతర పనులు చేయడం జరిగిపోయింది.
  • బ్రాండన్ ఇలా చిప్ ఆధారిత లాకింగ్ సిస్టమ్ లు పెట్టించుకోవడం ఇదే తొలిసారి కాదట. తన ఇంటి మెయిన్ డోర్ లాక్ తన ఎడమ చేయిలో ఉంటుందని బ్రాండన్ చెబుతున్నాడు.