ARTICLES

అన్నింటికీ మూలం ధనమే…కొన్ని విషయాలు తెలుసుకోండి

అన్నింటికీ మూలం ధనమే. ఇది లేకపోతే అందరూ ఉన్నా అందరికీ కాని వారుగానే మిగిలిపోవాల్సి వస్తుంది! అందుకే కష్టపడాలి. అలా కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత తిరిగి సంపాదించి పెట్టాలి. ఈ విధమైన డబ్బు విషయాల గురించి తెలుసుకుందాం…

representational image25లో ఉండగానే సొంతిల్లు
సాధారణంగా 35 ఏళ్లు ఆపై వయసుకు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది సొంతిల్లు ఏర్పాటుచేసుకోవడం జరుగుతోంది. కానీ, దీన్ని పదేళ్లు ముందుకు జరిపి 25 ఏళ్లకే సమకూర్చుకోవాలంటున్నారు మనీ నిపుణులు. ఎందుకంటే ఈ వయసులో అంతా స్వేచ్ఛా జీవనమే. ఫ్రెండ్స్ తో కలసి సరదాగా విందులు, వినోదాలకు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఖరీదైన బైకులు, మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లు కొనేస్తుంటారు. ఇక టూర్ల సంగతి సరేసరి. చిన్న వయసులో జాబ్ లో చేరి, ప్రతీ నెలా మంచి వేతనం వస్తుంటే అదంతా ఈ రూపంలో ఖర్చయిపోతుంటుంది. అందుకే చాలా మందికి ఈ వయసులో లక్ష్యాల అవసరం కనిపించదు. 25 ఏళ్లకే ఇల్లు కొన్న వారు 50 ఏళ్లు వచ్చేసరికి మిలియనీర్లు అవుతారట. అలా అని పెద్ద ఇల్లే కొనాలనేమీ లేదు. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నా సరే. 20 శాతం డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం సర్దుబాటు చేస్తుంది. అందుకే ఏ వయసులో ఉన్నాగానీ ఆలోచించకుండా వెంటనే ఇల్లు సమకూర్చుకుంటే సరిపోతుంది.

డౌన్ పేమెంట్
బ్యాంకులు ఇంటి కోసం ఇచ్చే అప్పులో ఖాతాదారుడు తన వాటాగా 20 శాతం డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటే సరిపోతుంది. అంటే రూ.20 లక్షల రుణానికి రూ.4 లక్షలు సొంతంగానే సన్నద్దం చేసుకోవాల్సి ఉంటుంది. రూ.5 లక్షలతో కారు కొనాలనుకుంటే 40 శాతం డౌన్ పేమెంట్ ప్రకారం కనీసం రూ.2 లక్షలు రెడీ చేసుకోవాలి. ఉదాహరణకు రెండేళ్ల కాలంలో కారు కొనాలనుకుని, అందుకు రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలని భావిస్తే… ప్రతీ నెలా 8,300 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. కనీసం 5-10 ఏళ్ల కాల వ్యవధిని నిర్ణయించుకుని ఆ సమయంలో రుణాలకు కావాల్సిన డౌన్ పేమెంట్స్ ను సిద్ధం చేసుకోవాలి.

సకాలంలో చెల్లింపులు, క్రెడిట్ స్కోరు
మంచి క్రెడిట్ స్కోరుతో రుణాలను సులభంగా, తక్కువ వడ్డీ రేటుకే పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు, ఇతర ఏ రుణాలైనా గానీ వాయిదాలను సకాలంలో చెల్లించడమే దీనికి సులభ పరిష్కారం. క్రెడిట్ స్కోరు 750కి తగ్గకుండా 900 వరకు ఉంటే దాన్ని గుడ్ గా చెబుతారు. అందుకే మంచి స్కోరు కొనసాగేలా  చూసుకోవడం అవసరం. అవసరం లేని క్రెడిట్ కార్డులను వెనక్కి ఇచ్చేయాలి.

representational imageఖర్చులకు కళ్లెం
ఎక్కువ మంది వినోదం, డైనింగ్, రవాణాపై అధికంగా ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, బయటి ఫుడ్ ను ఆర్డర్ చేసి మరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు. నవ జంట అయితే దేశీ, విదేశీ పర్యాటక సందర్శనలు, కార్లపై ఎక్కువగా వ్యయం చేస్తున్నారు. డబ్బు దాసోహం అనాలంటే ఈ తరహా ఖర్చులను కొంత మేర తగ్గించుకోవాల్సిందే.

పుస్తక సాయం
ఆర్థిక స్వేచ్ఛ గురించి తెలుసుకోవాలంటే ‘రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్’ అనే పుస్తకాన్ని చదవాలి. ఈ తరహా పుస్తకాల్లో ఆయా రచయితలు ఎంతో లోతైన విశ్లేషణ, అధ్యయనంతో సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం ఉంటుంది.

representational imageక్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు
క్రెడిట్ కార్డును విచక్షణారహితంగా వాడేస్తే ప్రమాదమే. అలా అని అసలు క్రెడిట్ కార్డు వినియోగించకపోవడమూ తెలివైన నిర్ణయం కాబోదు. ఎందుకంటే క్రెడిట్ కార్డును బాధ్యతగా, జాగ్రత్తగా వాడడం వల్ల ఉపయోగాలున్నాయి. అన్ని బిల్లుల చెల్లింపులు, షాపింగ్, ఏ ఖర్చు అయినా సరే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలి. దీనివల్ల ప్రతీ రూ.100పై రెండు నుంచి మూడు శాతం వరకు రివార్డులు పొందొచ్చు. క్రెడిట్ కార్డులో ఎంత మేర వాడుకున్నారో చూసి అంత మేర చివరి తేదీ లోపల బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాలి. దీనివల్ల క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది. మరో విషయం ఏమిటంటే, నెలలో చేసిన ఖర్చులన్నీ కళ్లముందుంటాయి. దీంతో అనవసర ఖర్చులను గుర్తించి వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు.

ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడులు
సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం అన్నది అందరికీ తెలిసిందే. మరి ఇలా పొదుపు చేసిన మొత్తం ఇన్వెస్ట్ మెంట్ కు మళ్లించడం అన్నది చాలా అవసరం. అయితే, పొదుపును మదుపు వైపునకు పంపే విషయంలో చాలా మంది అంత శ్రద్ధ చూపించరు. ఎందుకంటే తగిన సమయం లేకపోవడం, ఉన్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడమే. అందుకే ఆర్థిక నిపుణులను సంప్రదించి తగిన పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటికనుగుణంగా ప్రతీ నెలా 1వ తేదీనే బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా వెళ్లేలా ఆమోదం తెలిపితే చాలు.

representational imageవేతనం కాదు, వేరే ఆదాయం
ఆర్థికంగా కుబేరులైన వారిని పరిశీలించి చూస్తే ఓ విషయాన్ని గుర్తించొచ్చు. వారికి బహుళ రూపాల్లో ఆదాయం వస్తుంటుంది. నగదుపై వడ్డీ, స్టాక్స్ నుంచి డివిడెండ్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై అద్దె ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం వచ్చేలా వారు తమ ఆర్థిక జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు.

ఎంత ఆదా చేశారు…
ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు… ఎంత ఆదా చేశామన్నది సంపద శాస్త్రంలో కీలకం. సంపదను సృష్టిస్తుంటే అందులో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగానూ అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతీ నెలా రూ.10 వేలు పొదుపు చేస్తున్నారనుకుంటే దాన్ని వచ్చే 12 నెలల కాలంలో రెట్టింపునకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్ణయింకోవడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది.