Politics

కాంగ్రెస్ పార్టీ కోమా నుండి ఇంకా బయటికి రాలేదని ఎద్దేవా చేసిన మోడీ

బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అసోం, బెంగాల్, కేరళలో ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ ఇంకా కోమా నుంచి బయటకు రాలేదని అన్నారు. బీజేపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు బాధ్యతారహితంగా ఉందని, ఇది చాలా దురదృష్టమని అన్నారు.

60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదనే కారణంతోనే బీజేపీకి దేశ ప్రజలు పట్టం కట్టారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మోదీ చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ… ఆ పని చేయడం లేదని అన్నారు. అధికారం కోసమే తమ పార్టీ ఉందనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటుందని, ప్రజా తీర్పును కూడా ఆ పార్టీ పట్టించుకోదని విమర్శించారు. పతనావస్థలో ఉన్న తమ పార్టీ గురించి కాకుండా, ఎప్పుడూ బీజేపీ గురించి అది ఆందోళన చెందుతుంటుందని ఎద్దేవా చేశారు.